Farmer procurement centers Telangana
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైతు పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూర్, చిల్పూర్ మండలం రాజవరం, చిన్న పెండ్యాల గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దన్నదే ప్రభుత్వ ఉదేశ్యం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 3 లక్షల వరకు రుణ మాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం, సన్నాలకు బోనస్, మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రికరణకు 50 సబ్సిడీ వంటి పథకాలను అమలు చేస్తూ రైతుకు అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలలో వరి, 20వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారని అన్నారు. అందుకు కారణం దేవాదుల ప్రాజెక్టు అని అన్నారు. దేవాదుల ద్వారా గోదావరి జలాలు పొలాలకు చేరడంతో పంట దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత కూడా పెరిగిందని వెల్లడించారు.
రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వమే మద్దతు ఇచ్చి దాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ధాన్యం కొనుగోలుతో సీజన్ కు ప్రభుత్వానికి 5 వేల కోట్ల నష్టం వస్తుందని అయినప్పటికీ రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు 23 వేల కోట్లు, మక్కల కొనుగోలుకు 5 వేల కోట్లు ప్రభుత్వం రుణంగా తీసుకుందని రైతులు పంట అమ్మిన 3,4 రోజులలోనే డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయాని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకొని మద్దతు ధరకు దాన్యాన్ని అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. నియోజకవర్గంలో అత్యధిక కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు కేటాయించడం ద్వారా రెండు రకాల లాభాలు ఉన్నాయని మహిళా బాధ్యతగా పని చేస్తారని అలాగే ఉపాధితో పాటు ఆదాయం వచ్చి మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడుతాయాని వెల్లడించారు.
పామునూర్ లో ఇప్పటికే 35 లక్షలతో సిసి రోడ్లు ఎస్సి కమ్యూనిటీ హల్ కు 10 లక్షలు, గౌడ కమ్యూనిటీ హల్ కు 5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బంజరు మాటు, పర్రె కాలువలకు నిధులు మంజూరు చేయించి త్వరలోనే పనులు ప్రారంభిస్తానని తెలిపారు. అలాగే పామునూరు- నమిలిగొండ రోడ్డు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాజవరంలో అత్యధికంగా వరి సాగు అవుతుంది అంటే కారణం రిజర్వాయర్ అని అన్నారు. ఆ రిజర్వాయర్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. గ్రామంలో ప్రధాన రహదారి, స్కూల్ భవనం, సిసి రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు నేను చెసినవే అని తెలిపారు. చిన్నపెండ్యాల గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విద్యుత్ లైన్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయిస్తానని, ఎస్సి కాలనీ నుండి జాతీయ రహదారికి వెళ్లే రోడ్డును కూడా నిధులతో సిసి రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన కడియం మార్క్ అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నానని దానికి మీ అందరి సహకారం, ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సర్పంచులు సంపత్ రెడ్డి, రాజు, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, మోటం రాజు, ఇల్లందుల తిరుపతమ్మ, సాంబరాజు, ఆర్డివో వెంకన్న, డిఆర్ డిఏ పీడీ నూరోద్దీన్, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, మోటం శ్రీనివాస్, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, వ్యవసాయ శాఖ అధికారులు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
