Kadiyam Srihari corruption challenge
* అవినీతి ఆరోపణలపై కడియం శ్రీహరి బహిరంగ సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినాయకత్వంపై మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరుల ప్రాణత్యాగాలతో సిద్ధించిన తెలంగాణ గడ్డపై కేవలం ఒకే ఒక్క కుటుంబం పెత్తనం సాగించిందని ఆయన ఆరోపించారు.
* కుటుంబ పాలనపై ఆగ్రహం
“తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారుతాయని ప్రజలు ఆశపడ్డారు. కానీ, అది కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర సంపదను దోచుకుని వేల కోట్లు గడించారు. ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపి, ఆ కుటుంబం మాత్రం లాభపడింది” అని కడియం విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన అప్రజాస్వామిక పోకడలు, నియంతృత్వ ధోరణులు నచ్చకే తాను ఆ పార్టీని వీడి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
* అవినీతి నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం
తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ నీతికే కట్టుబడి ఉన్నానని కడియం శ్రీహరి పునరుద్ఘాటించారు. “నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు. అవినీతికి ఆమడ దూరంలో ఉన్నాను. నాపై బురద జల్లాలని చూస్తున్న వారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. నాపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా, క్షణం ఆలోచించకుండా నా పదవికి రాజీనామా చేస్తాను” అని ఆయన సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు కేవలం అసూయతో కూడినవేనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
