BANGALORE LOVER BURNT ALIVE
బెంగళూరు: ప్రేమ ఎంత మధురమో, కక్ష పెంచుకుంటే అంత భయంకరంగా మారుతుందని నిరూపించే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. “కొత్త స్టైల్లో ప్రపోజ్ చేస్తాను” అని నమ్మించి, ప్రాణంగా ప్రేమించిన ప్రియుడినే అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేసిన ఓ యువతి ఉదంతం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.
*ఏడాది కాలంగా వీరిద్దరి ప్రేమ
బెంగళూరులోని ఒక ప్రముఖ టెలికాం స్టోర్‌లో ప్రేరణ (27) అనే యువతి పనిచేస్తోంది. అదే స్టోర్‌లో పనిచేసే కిరణ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడాది కాలంగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం సాఫీగానే సాగుతూ వచ్చింది.
*ప్రాధాన్యత ఇవ్వడం లేదని కక్ష
అయితే, గత కొద్దిరోజులుగా కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తనకు తగినంత గౌరవం, సమయం:ఇవ్వడం లేదని ప్రేరణ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే అతనిపై పగ పెంచుకున్న ఆమె, కిరణ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకుంది.
*ప్రపోజ్ చేస్తానని పిలిచి సజీవ దహనం
పథకం ప్రకారం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్‌ను తన నివాసానికి పిలిచింది. కాసేపు సరదాగా మాట్లాడి అతడిని నమ్మించింది. “నీకు ఒక కొత్త స్టైల్లో ప్రపోజ్ చేయబోతున్నాను” అని చెప్పి, కిరణ్ కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. అతను అది నిజమైన సర్ప్రైజ్ అని నమ్మి కళ్లు మూసుకున్నాడు. అదే సమయంలో కిరణ్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు అంటుకోవడంతో కిరణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.
*పోలీసులు సైతం షాక్
ఈ ఘోర కలియుగంలో ప్రేరణ చేసిన పని చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కిరణ్‌ను తగులబెడుతున్న సమయంలో ఆమె ఏమాత్రం కనికరం లేకుండా ఆ దృశ్యాలను తన మొబైల్లో వీడియో తీసినట్లు అధికారులు వెల్లడించారు.
*నిందితురాలిని అదుపులోకి కేసు నమోదు
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రేమించిన వ్యక్తిని ఇంత క్రూరంగా చంపడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
