KALVAKUNTLA KAVITHA RTC SHANKAR DEATH NARSAMPET
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శంకర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆమె, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
* ప్రభుత్వ కుట్రలే ప్రాణం తీశాయి
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, దీనికి నిరసనగా కార్మికులు సమ్మెకు దిగితే ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని కవిత విమర్శించారు. ప్రభుత్వ కుతంత్రాలను భరించలేకనే శంకర్ నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు.
* అర్థరాత్రి హైడ్రామా..
కంచన్ బాగ్ లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ ను పరామర్శించేందుకు గురువారం అర్ధరాత్రి కవిత వెళ్లగా, ప్రభుత్వం పోలీసులతో ఆమెను అడ్డుకుంది. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, డాక్టర్లను బయటకు పంపి శంకర్ 80 శాతం కాలిన గాయాలతో వెంటిలేటర్ పై ఉన్నారని చెప్పించారని ఆమె మండిపడ్డారు. తెల్లవారేసరికి ఆయన మరణవార్త వినాల్సి రావడం బాధాకరమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆమె ధ్వజమెత్తారు.
* కవిత డిమాండ్లు ఇవే…
ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడిన కవిత, ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు డిమాండ్లను ఉంచారు. శంకర్ కుటుంబానికి తక్షణమే రూ. 2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
