minister bandi sanjay narsampet shankar goud RTC driver
* కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అడ్డుకున్న పోలీసులు..
* పోలీసుల తీరుపై బండి సంజయ్ నిప్పులు.. వెనక్కి తగ్గిన ఖాకీలు
ఆకేరు న్యూస్, నర్సంపేట:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో శుక్రవారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మహేశ్వరం గ్రామ శివారులో ఆయన కాన్వాయ్‌ను నిలిపివేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
* పోలీసుల ఆంక్షలు – మంత్రి ఆగ్రహం
మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం ఒకే ఒక్క వాహనాన్ని మాత్రమే ముందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. “ఒక సాధారణ పౌరుడిగా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా మరణించిన కార్మికుడికి నివాళి అర్పించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటి?” అని పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
* బిజెపి శ్రేణుల భారీ మోహరింపు
కేంద్ర మంత్రిని అడ్డుకున్నారన్న వార్త తెలియగానే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో నర్సంపేట – ముత్తోజీపేట రహదారిపై కొద్దిసేపు తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
* ముత్తోజీపేట వైపు పయనం
పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు, కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు వెనక్కి తగ్గారు. అనంతరం ఆయనను ముత్తోజీపేట వెళ్లేందుకు అనుమతించారు. దీంతో వందలాది మంది కార్యకర్తలతో కూడిన భారీ ర్యాలీతో బండి సంజయ్ ముత్తోజీపేటకు బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఆయన శంకర్ గౌడ్ నివాసానికి చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
