Krishnajigudem health center delay
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
గ్రామంలో హేల్త్ సెంటర్ వెంటనే నిర్మాణం చెపట్టాలి కోరుతూ కృష్ణాజిగూడెం గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణజిగూడెంలో హెల్త్ సెంటర్ నిర్మాణం విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం రూ.20 లక్షల నిధులతో హెల్త్ సెంటర్‌కు శంకుస్థాపన జరిగినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ గెలుపొందిన కారణంగానే అభివృద్ధి పనులు నిలిపివేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌ను ఐదుసార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఆర్డీవో ఈ వ్యవహారంలో భాగస్వామ్యంగా వ్యవహరిస్తూ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు మద్దతుగా నిలుస్తూ, గ్రామ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన సర్పంచులు గెలిచి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, కృష్ణజిగూడెంలో మాత్రం రాజకీయ కారణాలతో అభివృద్ధి నిలిచిపోయిందని ప్రజలు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించినప్పటికీ, ఆదేశాలు అమలు కాలేదని తెలిపారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు రాజకీయాలకు అతీతంగా పని చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించాలని కృష్ణజిగూడెం సర్పంచ్ మల్లం రవీందర్, వార్డు సభ్యులు పిండి ప్రశాంత్, సాదం బీమయ్య, ప్రజలు సాదం రాజేందర్, వడ్లకొండ యాదగిరి, సాదం విష్ణువర్ధన్, సాదం వెంకటయ్య, బుస యాదగిరి తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
