Paddy maize procurement delay
* ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో జాప్యంపై గూడూరులో అన్నదాతల ధర్నా
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు కేవలం ఒకటి రెండు ట్రాక్టర్ల ధాన్యం మాత్రమే అన్లోడ్ కావడమేమిటని వారు అధికారులను నిలదీశారు. ఆన్లైన్ విధానం పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, గతంలో నేరుగా మిల్లర్లకు ధాన్యం అప్పగించే పాత పద్ధతని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ జాప్యం కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాశులు పేరుకుపోయి, అమ్మకం కోసం వచ్చే ధాన్యం ఆరబోయడానికి స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని. దీనికి తోడు మొక్కజొన్నల కొనుగోలు కూడా ఆలస్యం అవుతోందని, గన్నీ సంచులు ఇవ్వడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
*మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో అదే పరిస్థితి*
మరోవైపు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని మార్క్ఫెడ్ మొక్కజొన్న కేంద్రంలో కొనుగోలు సైతం జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలో ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం కన్నా తక్కువ ఉన్నప్పటికీ, గన్నీ సంచులు పంపిణీ చేయకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే 90కి పైగా టోకెన్ నంబర్లు నమోదైనప్పటికీ, కేవలం 30వ నంబర్ వరకు మాత్రమే ధాన్యం అన్లోడ్ అయిందని పలువురు రైతులు తెలిపారు. గన్నీ సంచులు ఇవ్వమని అడిగితే అయిపోయాయి అంటున్నారని రైతులు తెలిపారు. మరోవైపు వాతావరణంలో మార్పులు సంభవించి మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడితే మొక్కజొన్నలకు ఫంగస్ సోకి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని, తద్వారా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు. వరి, మొక్కజొన్నల సేకరణలో ఎదురవుతున్న ఈ అడ్డంకులను తొలగించి, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.
*కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే కొనుగోలు ఆలస్యం*
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానాల వల్లే ఈ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి అన్నారు. గూడూరు ఐకెపి కేంద్రం, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఆందోళన చేస్తున్న రైతులతో ఆమె మాట్లాడారు. సమస్య తీవ్రత దృష్ట్యా ఆమె జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి, మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో రైతులకు వారితో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారంపై హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
