Jangaon Wedding Tragedy Accident
ఆకేరు న్యూస్ జనగామ : అది ఒక గిరిజన తండా.. మరికొద్ది గంటల్లో అక్కడ పెళ్లి బాజాలు మోగాలి. అక్షింతలు వేసి దీవించాల్సిన చేతులు ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాయి. కొత్త జంటను ఇంటికి ఆహ్వానించేందుకు ఆ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. కానీ, విధి వెక్కిరించింది. అతి వేగం రూపంలో వచ్చిన మృత్యువు, ఆ ఇంటి పెద్దను బలితీసుకుంది. తెల్లారితే కొడుకు పెళ్లి అనగా, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం బంజర తండాకు చెందిన జోగు సోమయ్య (55) కుమారుడికి వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి జరగాల్సి ఉండటంతో, శుక్రవారం రాత్రి తండాలో సందడి నెలకొంది. పెళ్లి వేడుక జరిగే ఫంక్షన్ హాల్ వద్ద వంటల కోసం ట్రాక్టర్లో కట్టెలు లోడ్ చేసుకుని సోమయ్య బయలుదేరారు. ట్రాక్టర్ వెళ్తుండగా, వెనుక నుండి అతి వేగంగా వచ్చిన ఒక కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ట్రాక్టర్ డబ్బా ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో డబ్బాలో కూర్చున్న సోమయ్యపై అది పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
* ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, బంధువులు కలిసి సోమయ్యను హుటాహుటిన జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, అంతర్గత గాయాలు బలంగా తగలడంతో సోమయ్య కన్నుమూశారు. పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులకు ఈ వార్త పిడుగులా తగిలింది.
* విషాదంలో మునిగిన బంజర తండా
తండ్రి మరణ వార్త విన్న కుమారుడు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. “రేపు మా నాన్న నన్ను ఆశీర్వదించాలి కదా.. ఇంతలోనే ఇలా జరిగిందేంటి?” అంటూ కుమారుడు గుండెలవిసేలా ఏడుస్తుండటం అక్కడి వారిని కలచివేసింది. శుభలేఖలు అందుకున్న బంధువులంతా పెళ్లికి రావాల్సిన వారు, ఇప్పుడు సోమయ్య అంత్యక్రియలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషాద ఘటనతో బంజర తండాలో పండుగ వాతావరణం కాస్తా శోకసంద్రంగా మారింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అతి వేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. పెళ్లి పనుల కోసం వెళ్తున్న వ్యక్తిని అజాగ్రత్తగా నడిపిన వాహనం బలితీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
