Singareni Women Dumper Operators
*సింగరేణిలో సంచలనం భారీ డంపర్లను నడపనున్న మహిళలు
*తొలిసారిగా 13 మందికి అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. 13 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వ సంస్థలో ఇప్పటివరకు కేవలం పురుషులకే పరిమితమైన “భారీ డంపర్ ఆపరేటర్” బాధ్యతలను ఇకపై మహిళలు కూడా చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ సింగరేణి యాజమాన్యం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
*సీఎం, డిప్యూటీ సీఎంల చొరవ..
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖామాత్యులు భట్టి విక్రమార్క మల్లు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదేశాల మేరకు సింగరేణి ఈ అడుగు వేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 60 నుండి 100 టన్నుల బరువుండే భారీ డంపర్లను నడపడం అత్యంత క్లిష్టమైన పని. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి సవాల్‌తో కూడిన బాధ్యతలను స్వీకరించడానికి మహిళా ఉద్యోగులు ముందుకు రావడం గమనార్హం.
*శిక్షణ పూర్తి చేసుకున్న నవనారీమణులు…
మొత్తం 35 మంది మహిళా ఉద్యోగులు ఈ బాధ్యతల పట్ల ఆసక్తి చూపగా, సిరిసిల్లలోని ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’ (TIDES) ద్వారా కంపెనీ ఖర్చులతోనే వీరికి హెవీ మోటార్ వెహికిల్ (HMV) శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళా ఉద్యోగులు ఇప్పుడు భారీ డంపర్లను నడపడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో విడుదలయ్యే నియామకాల్లో వీరికి ప్రాధాన్యత కల్పించనున్నారు.
*అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి…
కేవలం డంపర్ ఆపరేటర్లే కాకుండా, సింగరేణిలో ఇప్పటికే ఇతర క్లిష్టతర విభాగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.
బ్లాస్టింగ్ విభాగం: బెల్లంపల్లి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిలో క్లిష్టమైన బ్లాస్టింగ్ పనులను ఇప్పటికే మహిళలు పురుషులతో సమానంగా నిర్వహిస్తున్నారు.
రెస్క్యూ టీమ్: సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును కూడా ఏర్పాటు చేశారు.
*ఆత్మవిశ్వాసంతో ముందడుగు…
“మొదట్లో భారీ వాహనాలు నడపగలమా అని భయపడ్డాం, కానీ శిక్షణ తర్వాత మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతరిక్షంలోకి వెళ్తున్న మహిళలకు గనిలో డంపర్లు నడపడం అసాధ్యమేమీ కాదు” అని శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్పుతో రాబోయే రోజుల్లో సింగరేణి గనుల్లో భారీ డంపర్ల పైన మహిళా ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో దర్శనమివ్వనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
