PMJ Jewellery Robbery Case
* తుపాకులు స్వాధీనం
ఆకేరు న్యూస్, కరీంనగర్: నగరంలోని పీఎంజే (PMJ) జ్యూవెలరీ షోరూమ్‌లో ఇటీవల జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టపగలే కాల్పులు జరిపి నగలతో పరారైన ముఠా గుట్టును రట్టు చేస్తూ, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
* తుపాకులతో బెదిరించి…
కొద్దిరోజుల క్రితం కరీంనగర్ నడిబొడ్డున ఉన్న PMJ జ్యూవెలర్స్ షోరూమ్‌లోకి చొరబడిన దుండగులు, అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
* పోలీసుల వేట
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించారు. తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి కొంత మేర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
* ప్రధాన నిందితుడి కోసం గాలింపు…
ఈ దోపిడీ వెనుక మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న మరో కీలక నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. త్వరలోనే పోలీసులు పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
