Warangal black money scam arrest
వరంగల్ ఆకేరు న్యూస్ : సాధారణ కాగితం ముక్కలను నోట్లుగా చూపి.. లక్షల రూపాయలను కొల్లగొడుతున్న ఒక కిలేడీ ముఠా గుట్టును వరంగల్ టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు రట్టు చేశారు. కేవలం కలర్ ప్రింట్లతో నోట్లను తయారు చేయడమే కాకుండా, రసాయన విద్యతో ప్రజలను మాయ చేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
* అసలేమిటి ఈ ‘నల్ల’ దందా?
ఈ ముఠా అమాయకులను ఆకర్షించడానికి ఒక వింత పద్ధతిని ఎంచుకుంది. రూ. 500 అసలు నోటుకు ‘అయోడిన్ టింక్చర్’ పూసి దానిని నల్లగా మారుస్తారు. బాధితుల కళ్లముందే ‘సోడియం థయోసల్ఫేట్’ అనే ద్రావణాన్ని వాడి ఆ నలుపును పోగొట్టి మళ్ళీ అసలు నోటులా మార్చి చూపిస్తారు.ఇలాంటి నోట్లు తమ వద్ద కోట్లలో ఉన్నాయని, ఒక లక్ష రూపాయల అసలు నగదు ఇస్తే, మూడు లక్షల విలువైన ఇలాంటి ‘నల్ల నోట్లను’ (బ్లాక్ మనీ) ఇస్తామని ఆశ చూపిస్తారు.
తీరా బాధితులు నమ్మి డబ్బులు ఇచ్చాక, కేవలం నల్ల కాగితాల కట్టలను అంటగట్టి నిందితులు చల్లగా జారుకుంటారు.
* పోలీసుల మెరుపు దాడి – స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల కదలికలపై నిఘా ఉంచిన వరంగల్ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 1,48,000 అసలు నగదు, నేరాలకు వాడిన రెండు కార్లు, నకిలీ నోట్లు ముద్రించే ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్లు,
13 సెల్ఫోన్లు,మొత్తంగా రూ. 28 లక్షల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు.
*ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు వీరిదే హవా
అరెస్ట్ అయిన వారిలో నర్సంపేటకు చెందిన కిరణ్, శివ, రంజిత్, రవితో పాటు ములుగుకు చెందిన రాజ్‌కుమార్, ఖమ్మంకు చెందిన రాజశేఖర్, భువనగిరికి చెందిన యాకంబరం, కొత్తగూడెంకు చెందిన సాయికిరణ్ ఉన్నారు. వీరు గతంలో ములుగు, సికింద్రాబాద్ మొండా మార్కెట్, చైతన్యపురి, సూబేదారి వంటి ప్రాంతాల్లో అనేకమందిని నిలువునా ముంచినట్లు విచారణలో తేలింది.
*ముఠా గుట్టు రట్టు చేసిన పోలీస్ బాస్‌లు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్ మరియు వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
