Delhi Bus Gang R*ape
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ రాజధానిలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. 2012 నాటి ‘నిర్భయ’ ఉదంతాన్ని గుర్తుచేస్తూ, కదులుతున్న ప్రైవేట్ బస్సులో 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
* ఇంటికి వెళ్లేందుకు వెళుతుండగా..
మంగళపురిలోని ఓ ఫ్యాక్టరీలో పని చేసే బాధితురాలు, సోమవారం అర్ధరాత్రి తన విధి నిర్వహణ ముగించుకుని పీతంపురలోని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. రాణిబాగ్ సమీపంలోని సరస్వతీ విహార్ బి-బ్లాక్ బస్టాండ్ వద్ద నిలబడి ఉండగా, అక్కడ ఆగి ఉన్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు (బీహార్ రిజిస్ట్రేషన్) వద్దకు వెళ్లి సమయం ఎంత అయిందని డ్రైవర్ను అడిగింది. ఇదే అదనుగా భావించిన నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.
* రెండు గంటల పాటు నరకం…
నిందితులు బస్సును అక్కడి నుండి నంగ్లోయ్ వైపు పోనిస్తూ, సుమారు 7 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. డ్రైవర్ ఉమేష్, కండక్టర్ రామేంద్ర ఇద్దరూ కలిసి దాదాపు రెండు గంటల పాటు ఆమెను వేధించి, అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని నంగ్లోయ్ మెట్రో స్టేషన్ వద్ద వదిలేసి పరారయ్యారు.
* పోలీసుల చర్యలు…
బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, రాణిబాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టి, 24 గంటల్లోనే నిందితులు ఉమేష్, రామేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. నేరానికి వాడిన బస్సును సీజ్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(1), 70(1) కింద కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
