Bastar Development Amit Shah
* ‘బస్తర్ ఒలింపిక్స్’తో యువతకు భవిష్యత్తు- కేంద్ర హోంమంత్రి
ఆకేరు న్యూస్, డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ (Bastar) జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా బస్తర్ ప్రాంత సమగ్ర అభివృద్ధి, శాంతిభద్రతలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, స్థానిక ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిజాన్ని దాదాపు అణిచివేసిందని, బస్తర్ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందని వెల్లడించారు.
* సేవా కేంద్రాలుగా మారనున్న 70 భద్రతా క్యాంపులు…
గతంలో హింసాత్మక సంఘటనలకు కేంద్రాలుగా ఉండి, మావోయిస్టుల ప్రభావం తగ్గిన ప్రాంతాల్లోని దాదాపు 70 భద్రతా శిబిరాలను (Security Camps) ఇకపై ‘జన సువిధా కేంద్రాలు’ (సేవా కేంద్రాలు)గా మార్చబోతున్నట్లు అమిత్ షా ప్రకటించారు.
“ఒకప్పుడు తుపాకీ గుండ్ల మోతలు వినబడిన చోట.. ఇప్పుడు పాఠశాల గంటలు మోగుతున్నాయి. లాల్ సలామ్ స్థానంలో భారత్ మాతా కీ జై నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ సేవా కేంద్రాల ద్వారా స్థానిక గిరిజన ప్రజలకు ఒకే చోట విద్య, ఉచిత వైద్యం, రేషన్, డిజిటల్ సేవలు మరియు ఉపాధి శిక్షణ వంటి అన్ని ప్రభుత్వ సౌకర్యాలను అందజేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
* బస్తర్‌లో ‘గుజరాత్ తరహా’ అభివృద్ధి మోడల్….
బస్తర్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘గుజరాత్ తరహా అభివృద్ధి నమూనా’ను ఇక్కడ అమలు చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, రైల్వే లైన్లు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం ద్వారా బస్తర్ గిరిజన యువతకు స్థానికంగానే భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 2030 నాటికి బస్తర్ డివిజన్‌ను దేశంలోనే నంబర్ వన్ గిరిజన ప్రాంతంగా మార్చడమే కేంద్ర లక్ష్యమని చెప్పారు.
* ఒలింపిక్స్ రేంజ్లో క్రీడలకు ప్రోత్సాహం…
హింసను విడనాడి యువత ప్రగతి పథంలో పయనించేలా ‘బస్తర్ ఒలింపిక్స్’ వంటి క్రీడా పోటీలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని అమిత్ షా తెలిపారు. గిరిజన యువతలోని అపరమైన ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఒలింపిక్స్ ప్రమాణాల తరహాలో క్రీడా మౌలిక వసతులు, స్టేడియంలను నిర్మిస్తామన్నారు. ఈ క్రీడల్లో వందలాది మంది లొంగిపోయిన మావోయిస్టు యువత కూడా పాల్గొనడం శుభపరిణామమని కొనియాడారు.
ఆయుధాలు పట్టి తప్పుదోవ పట్టిన వారంతా హింసను వీడి, ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అమిత్ షా పిలుపునిచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
