Kadiyam Srihari Lift Irrigation Works
* అలసత్వం వీడి పనులను వేగవంతం చేయాలి
* సబ్ స్టేషన్ లేకుండా పంపు హౌస్ ఎలా పని చేస్తుంది ?
* అధికారులు, కాంట్రాక్టర్ పై కడియం ఆగ్రహం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
అధికారులు, కాంట్రాక్టర్ అలసత్వం వీడి పనుల వేగం పెంచాలని, జులై 31 వరకు లిఫ్ట్ -1పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలోనే సాగు నీరు అందించాలని స్థానిక కడియం శ్రీహరి ఆదేశించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి శివారు గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్-1 పంపు హౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులు, కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పనులు జరుగుతున్న తీరుపై అధికారులు, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ లేకుండా పంపు హౌస్ ఎలా పని చేస్తుంది? నీటిని ఎలా లిఫ్ట్ చేస్తారు ? పంపు హౌస్ తో పాటు సబ్ స్టేషన్ నిర్మాణం చేయాలని తెలియదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మంత్రి సమీక్ష సమావేశంలో జూన్ 30 వరకు పూర్తి చేస్తామని ఎలా చెప్పారని, సాధ్యం కానీ పనులు ఎందుకు చెప్తారని మండిపడ్డారు. సమస్యలు చెప్పకపోతే ఎలా పరిష్కారం అవుతాయాని ప్రశ్నించారు. పంపు హౌస్ సివిల్ వర్క్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, సబ్ స్టేషన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అప్రోచ్ ఛానల్ వర్క్ ఎప్పుడు పూర్తి చేస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశానని సాంకేతికంగా నీటి పారుదల శాఖపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. లిఫ్ట్ -1 ద్వారా చెరువులు, కుంటలు నింపేందుకు అదనపు పైప్ లైన్ అనుమతులు, పంపు హౌస్ వరకు అప్రోచ్ రోడ్ నిర్మాణం, పంపు హౌస్ వద్ద రెండు రూముల ఆఫీస్ కార్యాలయం నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు రోజులలో అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. లిఫ్ట్ -1 కు సంబందించి ప్రతీ కాంపోనెంట్ పై పూర్తి స్థాయి సమీక్షా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సివిల్ వర్క్, ఎలక్ట్రీకల్, అప్రోచ్ ఛానల్, పంపింగ్ మోటార్స్, పైప్ లైన్ వంటి పనులను ఖచ్చితమైన తేదీలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో జులై 31 నాటికి లిఫ్ట్ -1పనులు పూర్తి చేయాలని, ఈ వర్షాకాలంలోనే లిఫ్ట్-1 ద్వారా సాగు నీరు అందించాలని స్పష్టం చేశారు. ఇందుకు ఏ సమస్యలు ఉన్న పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉంటానని అన్నారు. లిఫ్ట్ -1ను పూర్తి చేసేందుకు నేను ఎంత సీరియస్ గా ఉన్నానో అధికారులు, కాంట్రాక్టర్లు కూడా అంతే సీరియస్ గా పని చేయాలని ఇందులో ఏమాత్రం జాప్యం జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్టేషన్ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఏతైన ప్రాంతాలు చిల్పూర్, వేలేరు మండలాలకు సాగు నీరు అందించేందుకు 104 కోట్లతో 3 లిఫ్ట్ లు L1, L2, L3 లతో గండి రామారం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో లిఫ్ట్ -2పనులు పూర్తి అయ్యాయని అన్నారు. ఈ రోజు లిఫ్ట్ – 1 పంపు హౌస్ నిర్మాణ పనులు చాలా మందకోడీగా జరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో జులై 31 వరకు లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలోనే చిల్పూర్, వేలేరు మండలాల రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నా మొదటి ప్రాధాన్యత సాగు నీటి రంగమేనని నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి దేవాదుల కాలువల పూడిక తీత, కొత్త కాలువల నిర్మాణం చేపట్టి నియోజకవర్గంలో దాదాపు 80 శాతం ఆయకట్టుకు కాలువల ద్వారా గోదావరి జలాలతో సాగు నీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దింతో నియోజకవర్గంలో ఆయకట్టు పెరగడంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని ఇందుకు కారణం గోదావరి జలాలు రావడమే అన్నారు. 146 కోట్లతో ఘనపూర్ నుండి నవాబ్ పేట ప్రధాన కాలువ, ఉప కాలువల లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ఇందులో 4L వద్ద షేట్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 4 నియోజకవర్గాలలో 70 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్న దేవాదుల ఫెజ్-3 ప్యాకేజి-6పనులు అంచనా వ్యయం పెరగడం వల్ల ఆగిపోయాయని, కానీ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్యాకేజీ-6యొక్క ప్రాధాన్యత ను వివరించి రూ. 1015 కోట్లతో సవరించిన అంచనాలతో మంజూరు చేయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో రూ. 400 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులన్నింటిని ఏడాదిలో పూర్తి చేసి నియోజకవర్గ రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, చిల్పూర్, మున్సిపాలిటీ చైర్మన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు హరినాథ్, నీల రాజమ్మ గట్టయ్య, పెసరు సారయ్య, పొన్న రాజయ్య, బూర్ల శంకర్, నాగరబోయిన శ్రీరాములు, బెల్దే వెంకన్న, గట్టు రమేష్, బొల్లు లక్ష్మి తిరుమల స్వామి దేవస్థానం చైర్మన్ నరసింహులు, కిషన్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
COLLECTOR CHAHAT BAJPAI | విద్యా వారోత్సవాల్లో హనుమకొండ కలెక్టర్
