* భారీగా మోహరించిన పోలీసులు
* ఇరు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెదక్ లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. జంతు వధ నేపథ్యంలో నిన్న జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పోలీసు వలయంలో ఉంది.
అసలేం జరిగిందంటే..
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోలిగడ్డకు చెందిన రాజ్‌అరుణ్ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో అతని వర్గీయులపై మరో వర్గం రాళ్ళతో దాడి చేసింది. నార్సింగి అనే యువకుడికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన యువకుల వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో సంఖ్యలో చేరుకుని… రాళ్ల దాడి చేసిన వారు ఒక ప్రైవేటులో ఆస్పత్రిలో ఉన్నారని భావించి కర్రలతో ఆ ఆస్పత్రి అద్దాలను, ముందు నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. దీంతో వారు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. రెండు గంటల పాటు నిరసన కొనసాగించారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మెదక్ పట్టణ బంద్‌కు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ పిలుపునిచ్చాయి.
ఐజీ పర్యవేక్షణ
మెదక్‌లో పరిస్థితి పూర్తి అదుపులో ఉందని ఐజీ రంగనాథ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆయన మెదక్‌ను సందర్శించారు. ప్రజలందరూ సమన్వయం పాటించాలని కోరారు. ఘర్షణకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, వదంతులను నమ్మొద్దని సూచించారు. బందోబస్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
————————–