Manchu Manoj Dasari Memorial
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘దర్శకరత్న’గా, పరిశ్రమకు పెద్ద దిక్కుగా వెలిగిన దిగ్గజ దర్శకుడు స్వర్గీయ దాసరి నారాయణరావు సమాధి నిర్లక్ష్యానికి గురైన తీరుపై సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ వీడియోపై టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ అత్యంత వేగంగా, బాధ్యతాయుతంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
* ఇచ్చిన మాట ప్రకారం..
దాసరి నారాయణరావు సమాధి ప్రాంగణం ఎండిపోయిన ఆకులు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న దుస్థితిని ఓ ప్రముఖ యాంకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మంచు మనోజ్ దృష్టికి వచ్చింది. దీనిపై తీవ్రంగా చలించిన మనోజ్.. శుక్రవారం రాత్రే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు.
* ఉదయాన్నే 7 గంటలకే శ్రమదానం…
మంచు మనోజ్ శనివారం ఉదయాన్నే 7 గంటలకే తన టీమ్‌తో కలిసి దాసరి నారాయణరావు సమాధి వద్దకు చేరుకున్నారు. తనకు సినిమా షూటింగ్ ఉన్నప్పటికీ, దానికంటే ముందే సమయాన్ని కేటాయించి అక్కడికి వెళ్లడం విశేషం. సమాధి ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తను, ఎండిన ఆకులను మనోజ్ అండ్ టీమ్ స్వయంగా ఊడ్చి, శుభ్రం చేసి ఆ ప్రాంతానికి తిరిగి గౌరవప్రదమైన రూపాన్ని తీసుకొచ్చారు.
* ఐక్య ధైర్య సేన సమితి ఆధ్వర్యంలో..
ఇటీవలే మంచు మనోజ్ మరియు ఆయన సతీమణి మౌనికా భూమా రెడ్డి సంయుక్తంగా “ఐక్య ధైర్య సేన సమితి” అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి తోడుగా నిలవడంతో పాటు, ఇలాంటి సామాజిక బాధ్యతాయుతమైన పనులను చేపట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే దాసరి సమాధి వద్ద తక్షణ పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు మనోజ్ పేర్కొన్నారు.
పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ఒక మహానుభావుడి స్మారకం ఇలాంటి స్థితిలో ఉండటం చూసి తట్టుకోలేకపోయానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మనోజ్ తెలిపారు. సమయానికి స్పందించి, క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేసిన మంచు మనోజ్ అండ్ టీమ్‌పై టాలీవుడ్ వర్గాలతో పాటు నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
