YS Sharmila Rajya Sabha Seat
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఆసక్తికరమైన వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలకు రాజ్యసభ సీటు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో బలంగా చర్చ నడుస్తోంది.
ఆమెను పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది.
* ఆనాటి హామీ.. నేడు నిజం కాబోతుందా..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)ని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆమె అధికారికంగా హస్తం గూటికి చేరిన సమయంలోనే అధిష్టానం షర్మిలకు ఒక కీలకమైన హామీ ఇచ్చినట్లు టాక్.
ఏపీలో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని నడిపించినందుకు గానూ, ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని.. అందులో భాగంగానే పార్లమెంట్ పెద్దల సభకు (రాజ్యసభ) పంపుతామని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అప్పట్లోనే బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
* ఖర్గే, రాహుల్‌లతో భేటీ వెనుక అసలు రహస్యం..
ఇటీవలి కాలంలో వైఎస్ షర్మిల ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పైకి ఇది కేవలం సాధారణ మరియు పార్టీ అంతర్గత పరిణామాలపై జరిగిన చర్చగా కనిపించినప్పటికీ..
అంతర్గతంగా మాత్రం రాజ్యసభ సీటు ఖరారు చేసుకోవడానికే ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని ఇన్సైడ్ టాక్. ఈ భేటీలోనే కర్ణాటక కోటా నుంచి ఖాళీ అయ్యే స్థానాల్లో ఒకదానిని షర్మిలకు కేటాయించేలా అధిష్టానం క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది.
* కర్ణాటక నుంచే ఎందుకు…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి సొంతంగా రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే బలం లేదు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పాటు స్పష్టమైన మెజారిటీ కలిగి ఉంది. దీంతో అక్కడ నుంచి ఎవరిని బరిలోకి దింపినా విజయం నల్లేరుపై నడకే అవుతుంది.
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల కీలక నేతలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యూహంతో షర్మిలను ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని హైకమాండ్ భావిస్తోంది.
* ఏపీ రాజకీయాలపై దీని ప్రభావం ఏమిటి..
షర్మిలకు రాజ్యసభ సీటు దక్కితే ఆమె జాతీయ స్థాయిలో పార్టీ తరఫున గళం విప్పే అవకాశం లభిస్తుంది.
అదే సమయంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు అధికార కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు ఆమెకు మరింత రాజకీయ బలం చేకూరుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. వైఎస్సార్ వారసురాలిగా జాతీయ స్థాయిలో ఆమెకు దక్కే గుర్తింపు.. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఉపయోగపడుతుందని పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.
