Minister Ponnam Pawan Kalyan
*పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ ఆంతర్యం తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే
* ఏపీలోనే సరిగ్గా పని చేయని పవన్.. ఇక్కడ నవ నిర్మాణమా ?
* దిష్టి వ్యాఖ్యలపై, తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– రవాణా, బీ.సీ. శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అస్థిత్వాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టే ముందు తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని రవాణా, బీ.సీ. శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సోమవారం హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ఇచ్చే రెమ్యునరేషన్ కోసం, లోపాయికారి ఒప్పందంలో భాగంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈ కొత్త నటనకు తినలేపారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని స్వయంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటూ గతంలో విషం కక్కారు. అలాంటి వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడ సభ పెట్టి మొసలి కన్నీరు కారుస్తుంటే తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ కూడా సహించడు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
* కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లి కి ఒడ్డాణం చేస్తా అన్నట్టు
ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేని వాడు, ఇక్కడికి వచ్చి నవ నిర్మాణం చేస్తాననడం హాస్యాస్పదం అని మంత్రి పొన్నం విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం నడుస్తోంది. ఎవరు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. కానీ, పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పేరు వెనుక ఉన్న ఆంతర్యం తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు కాబట్టే, ఇక్కడ పప్పులు ఉడకక దొడ్డిదారిన పవన్ కళ్యాణ్‌ను ఏజెంట్‌గా పంపిస్తోంది అని ఆరోపించారు.
మోదీని మెప్పించడం కోసం, తెలంగాణలో నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేయడమే పవనిజమా , నిజంగా నవ నిర్మాణం చేయాలనుకుంటే ఆ సభలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎందుకు పెట్టడం లేదు అని మంత్రి ప్రశ్నించారు.
* తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోం
మాకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఎప్పుడూ మంచి సంబంధాలే ఉండాలని కోరుకుంటాం, భారతీయులుగా ఇతర రాష్ట్రాలను గౌరవిస్తాం. పార్లమెంట్ సాక్షిగా, సకల జనుల సమ్మె ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణలో రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండగలా జరుపుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అమరవీరులను, పోరాట యోధులను గుర్తించి గౌరవిస్తోంది. ఇలాంటి తరుణంలో విద్వేష రాజకీయాలు చేయడానికి వస్తే ఊరుకునేది లేదు.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాలు చూసుకోవచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. అనువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్, ఇక్కడ సభ పెట్టే ముందు తెలంగాణ వాదులకు, ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
