Telangana Land Registration Rates
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో భూముల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కీలక అలర్ట్. రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు ఎల్లుండి (జూన్ 5) నుంచి అమల్లోకి రానున్నాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
* శాస్త్రీయంగా ధరల సవరణ..
భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కేవలం అంచనాలతో కాకుండా, క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి, ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే ఈ కొత్త విలువలను నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
* పారదర్శకతకు పెద్ద పీట..
కొత్త రిజిస్ట్రేషన్ రేట్ల అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా.. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మరింత పారదర్శకత రానుందని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లోని ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జూన్ 5 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు సవరించిన కొత్త ధరల ప్రకారమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి భూముల కొనుగోలు, అమ్మకాలు జరిపేవారు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
