Kazipet Railway Division Demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తెలంగాణ అభివృద్ధికి బిజెపి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందని, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జూన్ 1 నుండి ప్రారంభం అయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. నూతన రైల్వే ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కూడా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ డివిజన్ పరిధిలో అపారమైన బొగ్గు నిల్వలు, అటవీ సంపద, జల వనరులు, సారవంతమైన భూములు ఉన్నాయని అన్నారు. గత 12ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదని అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ప్రధాని మోడీకి, బీజేపీ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల నిజంగా వివక్ష లేకుంటే వెంటనే కాజీపేట రైల్వే డివిజన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు దద్దమ్మలుగా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే ప్రధాని మోడీ మంత్రి పదవులు ఇచ్చాడని ఏద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఒక్క ప్రాజెక్టు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ 13 లక్షల కోట్లు తెచ్చామని చెప్పడం సిగ్గు చేటనిఅన్నారు. 13 లక్షల కోట్ల లెక్క ఏంటో, 13 లక్షల కోట్లతో ఎ అభివృద్ధి పనులు చేశారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న మీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయిన వచ్చిందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, జాతీయ ప్రాజెక్టు, బడ్జెట్ లో వేల కోట్ల అదనపు నిధులు ఇస్తున్నారని అన్నారు. అదే తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు తెలంగాణకు మీరు ఎం తెచ్చారో ప్రజలకు చెప్పాలని అన్నారు. తెలంగాణ కేంద్ర మంత్రులకు, ఎంపిలకు, బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే, అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే తక్షణమే తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును, కాజీపేట రైల్వే డివిజన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ద్రోహి అని సంభోదించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు. అధికారం పోయిందనే అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు కొంచెం అయిన సిగ్గు ఉందా…. నీ స్వంత చెల్లె నీకు నాయకత్వ లక్షణాలు లేవని వదిలి వెళ్ళిందనీ అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల పరుష పదజాలం ఉపయోగించడం సరైంది కాదని వేల్లడించారు. కేటీఆర్ ఇప్పటికైనా బాష మార్చుకోవాలని లేదంటే నీకు అదే రీతిలో బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వైస్ చైర్మన్లు రాజమ్మ, ఐలయ్య, తీగల కరుణాకర్ రావు, ఇనుగాల వెంకటేశ్వర్ రెడ్డి, ఎడవెల్లి మల్లారెడ్డి, సురేష్, సంపత్ రాజు, బూర్ల శంకర్, మనోజ్ రెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు, కోళ్ల రవి, శిరీష్ రెడ్డి, బొడ్డు సమ్మయ్య, నీల గట్టయ్య, కో ఆప్షన్ సభ్యులు జిల్లా, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
