Minister Ponnam Prabhakar BC Gurukul Inspections Telangana
*ఆగస్టు 30లోగా అన్ని బీసీ గురుకులాల తనిఖీలు పూర్తి చేయాలి
* ప్రతి ఆర్సీవో వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
* ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు
* విద్యార్థుల్లో నాణ్యమైన విద్య, క్రీడలు, కళల్లో ప్రతిభను పెంపొందించడమే లక్ష్యం
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (MJPpTBCWREIS) పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురుకులాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై ఆర్సీవోలు (RCO), ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేసిన మంత్రి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు
* ఆర్సీవోల పర్యటనలు
ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (RCO) వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, కనీసం ఆరు గురుకులాలను సందర్శించాలి. హెడ్ఆఫీస్, జిల్లా యంత్రాంగం, పాఠశాలల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించాలి.
* భూసేకరణ & భవనాలు
సొంత భవనాలు లేని గురుకులాలకు కలెక్టర్లతో మాట్లాడి భూసేకరణ వేగవంతం చేయాలి. విద్యాసంస్థలు కేటాయించిన నియోజకవర్గ పరిధిలోనే ఉండేలా చూడాలి. అద్దె భవనాల నిధుల్లో 6% భవనాల మరమ్మతులకు వినియోగించాలి.
* ఆహార భద్రత & ఆరోగ్యం
ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, ఈ ఏడాది ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకూడదని ఆదేశించారు. విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు సైకాలజిస్టులతో అవగాహన సదస్సులు నిర్వహించాలి.
* క్రీడలు & సమగ్ర అభివృద్ధి
చదువుతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంలో విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రతిభావంతులకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుంది.
* పర్యావరణం & వర్షపు నీరు
ప్రతి గురుకులంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులచే మొక్కలు నాటించి, వాటి సంరక్షణ బాధ్యతలను వారికి అప్పగించాలి.
* అకస్మాత్తు తనిఖీలు
మంత్రి, కమిషనర్, కార్యదర్శి కలిసి ప్రతి నెలా కనీసం 15 గురుకులాలను అకస్మికంగా తనిఖీ చేస్తారని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే మూసీ గురుకుల విద్యాసంస్థకు సొంత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, MJPTBCWREIS కార్యదర్శి బడుగు సైదులు, డిప్యూటీ సెక్రటరీలు, ఆర్సీవోలు పాల్గొన్నారు.
