Bathini Fish Prasadam Hyderabad
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బత్తిని సోదరుల ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారికంగా ప్రారంభించనున్నారు.
* తరలివచ్చిన జనసందోహం క్యూలైన్లలో రోగులు…
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు శనివారం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాలకు చేరుకున్నారు. ప్రసాదం కోసం ముందస్తుగానే క్యూలైన్లలో నిలబడి టోకెన్లు తీసుకుంటున్నారు. సాంప్రదాయం ప్రకారం, చేప ప్రసాదం తయారీకి ముందు ఆదివారం దూద్‌బౌలిలోని బత్తిని వారి ఇంట్లో ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని’ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
* 35 కౌంటర్లు.. విసృ్తత ఏర్పాట్లు…
రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆస్తమా రోగులకు టోకెన్లు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికి ప్రసాదం అందించడానికి 35 కౌంటర్లు అందుబాటులో ఉంచారు. ప్రముఖులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా 2 కౌంటర్లు కేటాయించారు. క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, నిరంతర వైద్య సేవలు అందించేందుకు హెల్త్ క్యాంప్‌లు, మరియు కఠినమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
* 2 లక్షల చేప పిల్లలు సిద్ధం.. ధర ఎంతంటే..
గత ఏడాది కంటే ఈసారి రోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని మత్స్యశాఖ అంచనా వేసింది. గత సంవత్సరం లక్ష మందికి పైగా చేప పిల్లలను పంపిణీ చేయగా, ఈసారి దాదాపు రెండు లక్షల చేప పిల్లలను సిద్ధం చేసి పంపిణీ కేంద్రానికి తరలించారు.
ఒక్కో చేప పిల్లను రూ. 40 చొప్పున రోగులకు విక్రయిస్తున్నారు. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం నుంచే టోకెన్ల జారీ ప్రక్రియను ముమ్మరంగా ప్రారంభించారు.
శ్వాసకోశ సమస్యల ఉపశమనం కోసం దశాబ్దాలుగా వస్తున్న ఈ నమ్మకాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా భారీగా తరలివచ్చిన జనంతో నాంపల్లి గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. భక్తులు మరియు రోగులు ఎలాంటి తొందరపాటు పడకుండా, అధికారుల సూచనలు పాటిస్తూ ప్రసాదాన్ని స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు.
