Deepika Reddy SR University Convocation 2026
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్‌లోని ప్రముఖ విద్యాసంస్థ ఎస్ఆర్ యూనివర్సిటీ (SR University) 4వ స్నాతకోత్సవ (Convocation) వేడుకలు మంగళవారం క్యాంపస్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్, శ్రీ రాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఎ. వరదా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కోర్సులకు చెందిన సుమారు 1,500 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు.

* పద్మశ్రీ దీపికా రెడ్డికి డాక్టరేట్…
భారతీయ శాస్త్రీయ నృత్య రంగంలో, ముఖ్యంగా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు గానూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డికి ఎస్ఆర్ యూనివర్సిటీ “గౌరవ డాక్టరేట్” (Honoris Causa) ప్రదానం చేసింది. ఛాన్సలర్ ఎ. వరదా రెడ్డి చేతుల మీదుగా ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు.
* నిరంతర అభ్యసనమే విజయం…
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలానీ క్యాంపస్‌ల గ్రూప్ వైస్ ఛాన్సలర్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ వి. రాంగోపాల్ రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
“తెలంగాణలోని ఒక చిన్న గ్రామం నుండి ఐఐటీ ఢిల్లీ, బిట్స్ పిలానీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు నాయకత్వం వహించే స్థాయికి నా ప్రయాణం సాగింది. విజయం అనేది మనం ఎక్కడ ప్రారంభించామనే దానిపై కాకుండా.. మన నిబద్ధత, పట్టుదల, నిజాయితీపైనే ఆధారపడి ఉంటుంది. మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు నిరంతర అభ్యసనాన్ని (Lifelong Learning), సమకాలీన నైపుణ్యాలను అలవర్చుకోవాలి. వినూత్న పరిశోధనలు, వ్యవస్థాపకత (Entrepreneurship) ద్వారా వికసిత భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి.” అని ఆయన పిలుపునిచ్చారు.
* సమాజంలో మార్పు తీసుకురావాలి..
గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం శ్రీమతి దీపికా రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఆర్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు. క్లాసికల్ డాన్స్‌లో తన ఐదు దశాబ్దాల అనుభవాన్ని పంచుకుంటూ, నిజమైన విద్య కేవలం మార్కులతో ముగిసిపోదని, అది విలువలతో కూడినదై సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే సంస్కృతిని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి దీపికా రెడ్డి తాత, సీనియర్ రాజకీయ నాయకులు రామసహాయం సురేందర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

* టాప్-100 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఎస్ఆర్ వర్సిటీ
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పిస్తూ.. ఎస్ఆర్ యూనివర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. వరుసగా నాలుగేళ్లుగా ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) టాప్ 100 సంస్థల్లో స్థానం సంపాదించడంతో పాటు, ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026’లో గ్లోబల్ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు.
* ప్రతిభావంతులకు గోల్డ్ మెడల్స్…
ఈ వేడుకలో డాక్టర్ ఆఫ్ సైన్స్, పీహెచ్డీ, పీజీ, యూజీ కోర్సులు పూర్తి చేసిన 1,500 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అకడమిక్స్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం విద్యార్థులతో దేశ ఐక్యత, పర్యావరణ బాధ్యత, వృత్తిపరమైన విలువలపై ప్రతిజ్ఞ (Graduands’ Pledge) చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ వర్సిటీ ప్రో-ఛాన్సలర్ శ్రీ ఎ. మధుకర్ రెడ్డి, ప్రో-వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి. మహేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. వెంకట రమణారావు, డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
