Deputy CM Bhatti Vikramarka Station Ghanpur
* పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు
– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై ప్రజా సంక్షేమ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో మంగళవారం రూ. 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతులను, ప్రజలను వంచిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం చేస్తోన్న రికార్డు స్థాయి ధాన్యపు కొనుగోళ్లు, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను, వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. “ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లారు. ఆ పాపానికి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ. 76 వేల కోట్ల రూపాయలను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు కట్టాల్సి వస్తోంది. ఆ అప్పులే లేకపోయి ఉంటే ఈ రూ. 76 వేల కోట్లను ప్రజల సంక్షేమానికి అందించి రాష్ట్ర దశ, దిశ మార్చేవాళ్లం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల సొమ్మంతా గత పాలకుల ఇళ్లకే పోయిందని, అందుకే పదేళ్లలో పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గప్పాలు కొట్టుకున్నారే తప్ప, డిస్కంలకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా వాటిని అప్పుల పాలు చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
“మీరు చేసిన తప్పుల వల్ల డిస్కంలు ఆదాయం లేక, క్వాలిటీ పవర్ ఇవ్వలేక ఇబ్బంది పడ్డాయి. కానీ మా ప్రభుత్వం వచ్చాక రైతులు కట్టాల్సిన రూ. 14 వేల కోట్లను, పేదల ఉచిత కరెంట్ (గృహజ్యోతి) బిల్లు రూ. 5 వేల కోట్లను మొత్తంగా రూ. 19 వేల కోట్లను ప్రతి నెల ఆర్థిక శాఖ ద్వారా నేరుగా డిస్కంలకు చెల్లిస్తూ క్వాలిటీ పవర్ ఇస్తున్నాం అన్నారు. దీనిపై కూడా అభాండాలు వేయడం బీఆర్ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనం” అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా క్యాబినెట్ రోజుకు 18 గంటలు ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తుంటే.. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కేవలం వార్తల్లో ఉండటం కోసం రోజుకొక అబద్ధపు వార్తను సృష్టిస్తున్నారు. గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు. అధికారం పోయిందనే తట్టుకోలేక కట్టుకథలు అల్లుతున్నారు” అని హరీష్ రావుపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులను కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.
“మద్దతు ధర (MSP) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎఫ్ సి ఐ (FCI) ద్వారా ఎందుకు సేకరించడం లేదు? గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేసేది. ఇప్పుడెందుకు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు?” అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం కొన్నా, కొనకపోయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రమను గౌరవిస్తూ చివరి ధాన్యపు గింజ వరకూ కొంటుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటున్నారా అని ప్రశ్నించిన ఆయన, కేవలం తెలంగాణలోనే మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. ‘తగుదునమ్మా’ అంటూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కల్లాల్లోకి వస్తాం, రైతుల కన్నీళ్లు తుడుస్తాం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
“ఇన్ని రోజులు మీరెక్కడికి పోయారు? వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వానిది” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒకే విడతలో రూ. 22 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని, విమర్శలు మాని దమ్ముంటే కేంద్రం చేత ధాన్యం కొనుగోలు చేయించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

గత ప్రభుత్వం ‘డబుల్ బెడ్రూమ్’ పేరుతో పేదలను వంచించిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తొలి విడతగా రూ. 22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇల్లే లేని నిరుపేద కుటుంబం ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. మహిళా సాధికారతకు అండ మహిళా సంఘాలకు రెండున్నరేళ్లలోనే రూ. 67 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించామని, ఐదేళ్లలో ఈ మొత్తాన్ని రూ. 1.25 లక్షల కోట్లకు పెంచుతామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
మహిళా సంఘాలే స్వయంగా బస్సులు కొనుగోలు చేస్తే, వాటిని ఆర్టీసీలో తిప్పి వారికి స్థిరమైన ఆదాయం కల్పించే వినూత్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని వివరించారు.
సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరిన పలు అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రఘునాథ పల్లిలో పాలెంలో 220 కేవీ సబ్‌స్టేషన్ అప్‌గ్రేడేషన్‌పై తక్షణమే సాధ్యసాధ్యాల (Feasibility Study) పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న కరెంట్ లైన్ల మార్పిడి (Line Shifting) పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని సభాముఖంగా మాట ఇచ్చారు. గతంలో పక్కనబెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని, ఈ నియోజకవర్గానికి కూడా సబ్‌ప్లాన్ నిధులు పెద్ద ఎత్తున వస్తాయని పేర్కొన్నారు.
*వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం అధిక నిధులు అందించి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
* శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ..
నియోజకవర్గ అభివృద్ధికి ఈ విద్యుత్ సబ్ స్టేషన్లు కీలకమన్నారు. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం దేవాదుల ప్రాజెక్టు, ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుల ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
రఘునాథపల్లి 132 కేవీ సబ్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, లైన్ షిఫ్టింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కూడా కేటాయించాలని కడియం ఉప ముఖ్యమంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ కుసు పాషా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు, భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మామిడాల యశస్వినీ రెడ్డి, కుడా చైర్మన్, డిసిసి అధ్యక్షులు, హనుమకొండ జిల్లా ఇనుగాల వెంకట్రాం రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు, జనగామ జిల్లా లకావత్ ధన్వంతి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా కలెక్టర్, హనుమకొండ చాహత్ బాచ్ పాయ్, సియండి ట్రాన్స్‌కో డి. కృష్ణ భాస్కర్, కమీషనర్ ఆఫ్ పోలీసు వరంగల్ సన్ ప్రీత్ సింగ్, డిసిపి జనగామ బి.రాజ మహేంద్ర నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ, జనగామ, ఛైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్ (స్టేషన్) మునిసిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఘన్పూర్ (స్టేషన్), ఛైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థానం, ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, పల్లగుట్ట గ్రామం, సర్పంచి, ఎనగందుల నర్సింహా రెడ్డి, సాగరం సర్పంచి, మమత చేతన్, కొండాపూర్ సర్పంచి, గుగులోత్ దేవేందర్, కుర్చపల్లి సర్పంచి, బైకాని రాజు, నష్కల్ సర్పంచి రాజు వివిధ శాఖల అధికారులు నియోజకవర్గ ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు.
తదనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించిన రైతు సేవా కేంద్రంను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
