Bandla Ganesh Financial Assistance
అకేరు న్యూస్ డెస్క్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh).. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దేవుడిగా ఆరాధిస్తారు బండ్ల గణేష్. సాధారణంగా హీరోలపై నిర్మాతలు అభిమానం చూపిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ పై మాత్రం బండ్ల గణేష్ దైవ భక్తిని ప్రదర్శిస్తుంటారు.
అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కల్యాణ్ పై తన వీరభక్తిని చాటుతుంటారు బండ్ల గణేష్. కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగానూ పవన్ తీసుకునే ఏ నిర్ణయం అయినా బండ్ల గణేష్ సమర్థిస్తూంటారు.
తాజాగా పవన్ కల్యాణ్ వరంగల్ లో పర్యటించిన విషయం తెలిసిందే. తన అభిమాని నిరంజన్ చివరి కోరిక మేరకు ఆయన హన్మకొండలోని హనుమాన్ నగర్ లో ఉన్న బాలుడు నిరంజన్ ఇంటికి వచ్చారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని చూసి పవన్ చలించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి అతని ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.

నిరంజన్ ను పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ తన వంతు సాయం కూడా ప్రకటించారు. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ కు తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
నా ఆరాధ్య దైవం పవన్ కల్యాణ్ స్ఫూర్తితో, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను.. అని ఎక్స్ (X) వేదికగా ట్వీట్ పెట్టారు బండ్ల గణేష్. అంతేకాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవగానే చాలా కాలంగా ఉన్న నిరంజన్ కోరిక నెరవేరబోతుండటం హృదయాన్ని కదిలించిందని తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
