India A Team Tri Series Champion
* వైభవ్ తుఫాన్.. తిలక్ కెప్టెన్సీ మ్యాజిక్..
ఆకేరు న్యూస్, డెస్క్:
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా-ఏ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఏపై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటింది.
* ఫైనల్లో వైభవ్ రికార్డు షో
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏకు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఆరంభం ఇచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేసిన వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు.
అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండగా.. కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో ఔటైనా.. మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు.
* తిలక్ బాధ్యతాయుత ఇన్నింగ్స్
వైభవ్ ఔటైన తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కగా ముందుకు నడిపించాడు. 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌కు రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాంశ్ ఆర్య (39) మంచి సహకారం అందించారు.
చివర్లో అనుకుల్ రాయ్ (39), కుమార్ కుశాగ్ర (36), విప్రాజ్ నిగమ్ (27) వేగంగా పరుగులు జోడించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది.
India A beat Sri Lanka A by 66 runs to clinch the #TriNationSeries 2026 title 🏆
A brilliant campaign comes to a perfect end 👏💙
Scorecard ▶️ https://t.co/CnmyVyoyjy#SLAvINDA pic.twitter.com/hz1m4voody
— BCCI (@BCCI) June 21, 2026
* పోరాడిన లంక..
378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) అర్ధశతకాలతో పోరాడినా.. భారీ లక్ష్యాన్ని అందుకునే స్థాయిలో భాగస్వామ్యాలు నమోదు కాలేదు.
విజయకాంత్ వియాస్కాంత్ (39), సహన్ అరచ్చిగే (38), నిరోషన్ డిక్వెల్లా (25) కొంతసేపు ప్రతిఘటించినా.. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను తమ ఆధీనంలో ఉంచారు.
* బౌలర్ల సమష్టి ప్రదర్శన
భారత్ తరఫున యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్‌ను కుదేలు చేశారు. అనుకుల్ రాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశోక్ శర్మ, తిలక్ వర్మ చెరో వికెట్ సాధించారు.
దీంతో శ్రీలంక-ఏ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయి ఫైనల్లో పరాజయం పాలైంది.
* భవిష్యత్ టీమిండియాకు బలమైన సంకేతం
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్, తిలక్ వర్మ నాయకత్వం, యువ బౌలర్ల సమిష్టి ప్రదర్శన ఈ ట్రై సిరీస్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపాయి. ముఖ్యంగా వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడనే సంకేతాలు ఇచ్చింది.
