Venezuela Earthquake Baby Rescue
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రకృతి వైపరీత్యాలు సృష్టించే విధ్వంసం మధ్య అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు దేవుడు ఉన్నాడని నిరూపిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ఘటనే తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన వెనిజులాలో చోటుచేసుకుంది.
భూకంపం ధాటికి కూలిపోయిన ఒక భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన కేవలం 18 రోజుల పసికందు దాదాపు 48 గంటల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడింది.
* ఏడుపు వినపడటంతో రంగంలోకి రెస్క్యూ టీమ్..
భూకంపం సృష్టించిన బీభత్సంతో కూలిన భవన శిథిలాల కింద ఒక చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానిక రెస్క్యూ సిబ్బంది (CPNB) అప్రమత్తమయ్యారు. ఎంతో సున్నితంగా, జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టి శిథిలాలను తొలగించారు. దాదాపు రెండు రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా చీకట్లోనే ఉన్న ఆ పసిపాపను సురక్షితంగా బయటకు తీశారు.
* భావోద్వేగానికి గురైన తండ్రి..
రెస్క్యూ సిబ్బంది పసిబిడ్డను బయటకు తీసి అక్కడ ఆందోళనగా వేచి చూస్తున్న తండ్రికి అప్పగించారు. తన బిడ్డను క్షేమంగా చూసిన ఆ తండ్రి ఆనందంతో, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ పాపను హత్తుకున్నాడు. ఈ హృదయ విదారకమైన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని “నిజమైన అద్భుతం” అని అభివర్ణిస్తున్నారు.
* 90 నిమిషాల వ్యవధిలో తల్లి కూడా..
ఈ సంతోషం ఇలా ఉండగానే, రెస్క్యూ సిబ్బంది తమ శోధనను ఆపకుండా కొనసాగించారు. పాపను రక్షించిన కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే అదే శిథిలాల కింద చిక్కుకున్న ఆ చిన్నారి తల్లిని కూడా రెస్క్యూ టీమ్ ప్రాణాలతో కాపాడింది. దీంతో ఆ కుటుంబం మొత్తం క్షేమంగా బయటపడటంతో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
