Yashaswini Reddy Mega Job Fair
* నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం
– ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, పాలకుర్తి: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (MLA YASHASWINI REDDY) అన్నారు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళాలో వివిధ ప్రముఖ కంపెనీలలో ఎంపికైన అభ్యర్థులకు సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆఫర్ లెటర్లన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ టీపీసీసీ వైస్ ప్రసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాన్సీరెడ్డి ఎంపికైన యువతకు ఆఫర్ లెటర్లను అందజేసి అభినందనలు తెలిపారు.
* ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి మెగా జాబ్ మేళాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగం అనేది ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం సంతోషకరం అని అన్నారు .
ఉద్యోగాలు సాధించిన ప్రతి యువకుడు తన ప్రతిభతో సంస్థలో మంచి గుర్తింపు తెచ్చుకుని, మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
* హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు.
సుమారు 2,500 మంది యువత పాల్గొనగా, 38 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశాయని తెలిపారు. ఇప్పటికే పలువురు ఉద్యోగాల్లో చేరగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు నేడు ఆఫర్ లెటర్లు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ట్రస్ట్ కృషి కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఆఫర్ లెటర్లు అందుకున్న యువత తమకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి, ట్రస్ట్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రస్ట్ సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఎంపికైన అభ్యర్థులు,తదితరులు పాలొన్నారు
