Nitin Nabin Warangal Elections
* బీజేపీ కార్యకర్తలు ఫుల్‌టైమ్ పొలిటిషియన్లు – నితిన్ నబీన్
ఆకేరు న్యూస్, హనుమకొండ:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్ట్‌టైమ్ పొలిటిషియన్ మాత్రమేనని, బీజేపీలో ప్రతి కార్యకర్త ఫుల్‌టైమ్ పొలిటిషియన్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు.
రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
* గిరిజనుల నుంచి ఘన స్వాగతం
వరంగల్ పర్యటన సందర్భంగా నితిన్ నబీన్ కు గిరిజన సంఘాల ప్రతినిధులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గిరిజన నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
* తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని నితిన్ నబీన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎలాంటి రాజకీయ లాభనష్టాలు చూడకుండా బీజేపీ సహకరించిందని, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
* కాంగ్రెస్‌పై విమర్శలు
హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడం కాంగ్రెస్ నినాదంగా మారిందని నితిన్ నబిన్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటీఎంగా మారిందని విమర్శించారు.
కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని, దేశ భద్రత కోసం సర్జికల్ స్ట్రైక్స్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం బీజేపీదేనని పేర్కొన్నారు.
* వరంగల్‌లో కమలం జెండా ఎగురుతుంది – రామ్‌చందర్ రావు
ఈ సమావేశానికి కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై పూర్తి నమ్మకం కలిగిందన్నారు.
వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని, కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వాటి ఫలాలు ప్రజలకు అందలేదన్నారు.
వరంగల్ కార్పొరేషన్‌ను బీజేపీకి అప్పగిస్తే కేంద్ర నిధులతో నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
