Telangana EV Auto Scheme
* పెట్రోలు, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చుకునే చాన్స్
* రూ.1.5 లక్షలు అందించనున్న ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలోని ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం అమల్లోకి తేనున్నట్లు తాజాగా ప్రకటించింది. క్యూర్ పరిధిలో ఎన్ని ఆటోలు ఉన్నాయో ఇప్పటికే లెక్కలు తీసుకుంది. దాదాపు 18,766 ఆటోలు ఈ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అలాగే రెట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఈవీ ఆటో కొనుగోలుకు ప్రభుత్వం రూ.1.5 లక్షల సాయం అందించనుంది. క్యూర్ పరిధిలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గించడంతో పాటు, ఇంధన ధరల పెరుగుదల భారాన్ని ఆటో డ్రైవర్లకు తగ్గించేందుకు ప్రభుత్వం పాటు పడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
* కేబినెట్ లో ఆమోదం
తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026 రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీని ప్రకారం ప్రస్తుతం తమ ఆటోలనే లబ్ధిదారులు AIS–123 ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్ ద్వారా ఎలక్ట్రిక్‌గా మార్చుకోవచ్చు.ఈ విధానంలో కిట్ ఖర్చు, ఇన్స్టాలేషన్ , ప్రామాణిక ఫిట్మెంట్ ఉపకరణాల ఖర్చుతో కలిపి రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం – ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుంది. ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో భర్తీ చేయడం ద్వారా పట్టణ ప్రజా రవాణాను నెట్-జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం వెల్లడించారు.
* రూ.200 కోట్లు కేటాయింపు
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీ రూ.200 కోట్లతో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదించింది. క్యూర్ పరిధిలో ఉన్న వాహన యజమానులందరికీ వారి సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సమానంగా వర్తించనున్నందున, వివిధ సంక్షేమ శాఖల నుంచి నిధులను సమకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లు సమకూర్చే విధంగా ప్రతిపాదన రూపొందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
