Modi Takaichi Meeting India Japan Deals
* బుల్లెట్ రైలు, LNG పై బిగ్ డీల్స్…
ఆకేరు న్యూస్, డెస్క్: భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని తాకాయి. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సనాయే తకైచీ (Sanae Takaichi) భారత పర్యటనలో భాగంగా గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
* తకైచీకి ఘన స్వాగతం..
జపాన్ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకురాలు, ఆ దేశ తొలి మహిళా ప్రధాని అయిన సనాయే తకైచీకి రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ముఖాముఖి సమావేశమై పలు కీలక రంగాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జపాన్ మొదటి మహిళా ప్రధానికి స్వాగతం పలకడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఆమె నాయకత్వంలో ఇరు దేశాల బంధం మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
* ఇంధన భద్రత, LNG సరఫరాపై కీలక ఒప్పందం
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలకు ఇంధన భద్రత (Energy Security) అత్యంత కీలకంగా మారింది. ఇందులో భాగంగా ద్రవీకృత సహజ వాయువు (LNG) నిరంతరాయ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గ్లోబల్ సప్లై చైన్‌ను బలోపేతం చేయడం, ఇంధన కొరత లేకుండా చూసుకోవడంపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
* బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష
భారతదేశ ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిపై ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా సమీక్షించారు. జపాన్ సాంకేతిక సహకారంతో సాగుతున్న ఈ ప్రాజెక్టు పనుల వేగాన్ని మరింత పెంచాలని, సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
* ప్రపంచ శాంతికి మూలస్తంభం..
రక్షణ, సాంకేతికత, బయో-గ్యాస్ చొరవలతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించాయి. జాయింట్ ప్రెస్ మీట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “భారత్-జపాన్ బంధం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు.. ఇది ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ప్రధాన మూలస్తంభం” అని స్పష్టం చేశారు. పరస్పర నమ్మకమే ఈ బంధానికి బలమైన పునాది అని ఆయన కొనియాడారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
