Telangana Land Resurvey Program
ఆకేరు న్యూస్, రాయపర్తి : భూముల రీ సర్వే కార్యక్రమం ద్వారా దశాబ్దాల నాటి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ( సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ )ఎం శ్రీనివాస్ అన్నారు బుధవారం మండలంలోని కొండాపురం గ్రామములో నిర్వహించిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామ ప్రజలకు రీసర్వే ప్రక్రియ, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, డ్రోన్లు మరియు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) రోవర్ల ద్వారా ప్రతి ఇంచు భూమిని ఖచ్చితత్వంతో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఆధునిక కోర్స్ (CORS) నెట్వర్క్ ఆధారంగా సర్వే చేయడం వల్ల అక్షాంశాలు, రేఖాంశాల (Coordinates)తో సహా భూమి సరిహద్దులు డిజిటల్‌గా రికార్డవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో సరిహద్దు తగాదాలకు ఆస్కారమే ఉండదు.
ఉచితంగా సర్వే మరియు డిజిటల్ పాస్ పుస్తకాలు: ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఈ సర్వే నిర్వహిస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతుకూ అక్షరాలా ఖచ్చితమైన కొలతలతో కూడిన సరికొత్త ‘డిజిటల్ భూ హక్కు పత్రం’ (Title Deed) మరియు మ్యాప్ (FMB) అందజేస్తాం. వ్యవసాయ భూములే కాకుండా, గ్రామ కంఠం (ఇళ్ల స్థలాలు) మరియు ప్రభుత్వ భూములను కూడా సర్వే చేసి సరిహద్దురాళ్లు పాతడం జరుగుతుంది.
రైతుల భాగస్వామ్యం తప్పనిసరి: సర్వే సిబ్బంది క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు రైతులు తమ భూముల వద్ద ఉండి, పొరుగు రైతుల సమక్షంలో సరిహద్దులు చూపించి సహకరించాలి. ఏవైనా అభ్యంతరాలు లేదా యాజమాన్య హక్కుల వివాదాలు ఉంటే తగిన ఆధారాలతో సర్వే బృందానికి సమర్పించవచ్చు. వాటిని చట్టప్రకారం అక్కడికక్కడే పరిష్కరిస్తాం.
నకిలీ రికార్డులకు చెక్: రీసర్వే పూర్తయ్యాక భూ రికార్డులన్నీ ఆన్లైన్ అవుతాయి. దీనివల్ల ఒకరి భూమిని మరొకరు మార్చడం గానీ, నకిలీ రిజిస్ట్రేషన్లు చేయడం సాధ్యం కాదన్నారు
భూముల రీసర్వే అనేది మీ ఆస్తికి ప్రభుత్వం కల్పిస్తున్న శాశ్వత రక్షణ కవచం. దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై, తమ భూములకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకుని, రీసర్వేను విజయవంతం చేయాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఎం శ్రీనివాస్. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏ రాజేంద్ర చారి. గ్రామ సర్పంచ్ కనుకుంట్ల మంజుల. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి. జిపిఓపి రమేష్ గ్రామపంచాయతీ కార్యదర్శి నరసయ్య గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు
