Arunodaya Naganna Passed Away
ఆకేరు న్యూస్, ఖమ్మం: తెలుగు నేలపై ఐదు దశాబ్దాల పాటు తన విప్లవ, ప్రజాస్వామ్య గీతాలతో ప్రజల్లో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నింపిన ప్రముఖ ప్రజా గాయకుడు, ‘అరుణోదయ’ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు పరకాల నాగయ్య ఉరఫ్ అరుణోదయ నాగన్న (70) ఇకలేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు అజయ్ ఉన్నారు.
నాగన్న 1957లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో ఒక పేద గీత కార్మిక కుటుంబంలో పరకాల పాపయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక రైతు వద్ద పాలేరుగా పనిచేశారు. పశువులు కాస్తూనే సహజసిద్ధంగా జానపద కళలపై మక్కువ పెంచుకున్న ఆయన, సీపీఐ (ఎంఎల్) పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 1970ల నుండి విప్లవ గేయ కళాకారుడిగా ప్రయాణం ప్రారంభించి, తన కంచుకంఠంతో వేలాది మంది ప్రజలను చైతన్యపరిచారు. ఎమర్జెన్సీ కాలంలో రహస్య జీవితం గడుపుతూనే సాంస్కృతిక గేయాలకు ఊపిరి పోశారు.
మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోనూ ధూంధాం వేదికలపై ఆడిపాడి తనవంతు కీలక పాత్ర పోషించారు. ప్రముఖ విప్లవ చిత్రాల దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి నిర్మించిన పలు చిత్రాలకు నాగన్న అద్భుతమైన గీతాలు రాసి, ఆలపించారు. ముఖ్యంగా ‘దండోరా’ సినిమాలో ఆయన రాసిన “కొంగు నడుముకు చుట్టве చెల్లెమ్మ.. కొడవలి చేపట్టవే చెల్లెమ్మ” మరియు “కంపెనీ కూలోళ్లు కపడం ఎరుగనోళ్లు.. సారాయికి మరిగి కొంపముంచింది” అనే పాటలు అప్పట్లో సారా వ్యతిరేక పోరాటాల్లో మహిళల్లో విపరీతమైన చైతన్యాన్ని నింపాయి. ‘చలో అసెంబ్లీ’ చిత్రంలో ఆయన అందించిన “ఆగదు.. ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు” అనే గీతం శ్రామిక వర్గాల గొంతుకగా నిలిచింది.
జీవితాంతం ప్రజల కోసం బతికిన నాగన్న, మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణించిన వెంటనే ఖమ్మం ‘నేత్రనిధి’ ప్రతినిధులు ఆయన కళ్లను సేకరించారు. సమాజ శ్రేయస్సు కోరిన ఆయన ఆశయాల మేరకు, నాగన్న భౌతికకాయాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల నిమిత్తం శనివారం అప్పగించనున్నారు. నాగన్న మృతి పట్ల మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుతో పాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఘన నివాళులర్పించారు.
