CM Revanth Reddy 20 Years
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు. మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. నేటితో విజయవంతంగా 20 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు.
రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఒక సాధారణ ప్రజాప్రతినిధి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం వెనుక రేవంత్ రెడ్డి పట్టుదల, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటాలే కారణమని ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత ప్రగతి పథంలో దూసుకుపోవాలని వారు ఆకాంక్షించారు.
