Minister Ponguleti El Niño Telangana Preparedness
* వరంగల్ జిల్లాల స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష
ఆకేరు న్యూస్ ,హనుమకొండ:
ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండలోని ఐడీఓసీ (IDOC) కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్నీనో ముందస్తు చర్యలు, కంటింజెన్సీ ప్లాన్ వివిధ శాఖల సంసిద్ధతపై అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
* తీవ్రంగా ఎల్నీనో ప్రభావం
ఈ ఏడాది ఎల్నీనో వల్ల దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలపై ఈ వర్షాభావ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయన్నారు.
జిల్లాకో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు.
వరంగల్ ప్రత్యేకాధికారిగా దేవసేన ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనకు అప్పగించామని చెప్పారు. ఆమె జిల్లాలోని వ్యవసాయం, భూగర్భ జలాలు, తాగునీటి లభ్యతపై క్షేత్రస్థాయి నివేదికను తయారుచేసి సీఎం మరియు కేబినెట్‌కు అందజేస్తారని వివరించారు.
* కేంద్రానికి సమగ్ర నివేదిక
వర్షాభావ పరిస్థితులపై రూపొందించిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలను పొందేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎల్నీనో ప్రభావం ఉన్నప్పటికీ రైతులు, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, తాగునీరు మరియు వ్యవసాయ రంగానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం వేశారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ,డిప్ఊటీ స్పీకర్ డాక్టర్ రామచంద్రు నాయక్,, ఎమ్మెల్సీ ,బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్ తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు.
అలాగే రాష్ట్ర ప్రత్యేక అధికారిణి దేవసేన ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, డా. సత్య శారద, హేమంత్ బొర్ఖడే సదాశివరావు, సందీప్ కుమార్ ఝా, రాహుల్ శర్మ, స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు కేవీకే–ఐసీఏఆర్ (KVK-ICAR) శాస్త్రవేత్తలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
———
