Collector Borkhade Hemanth Sahadeva Rao, Mulugu Tribal Health Centre Proposal
* గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలకు ములుగులో అత్యాధునిక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన
– జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్, ములుగు:
గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలను మరింత బలోపేతం చేసే దిశగా ములుగు జిల్లాలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో బీబీనగర్ ఎయిమ్స్ డీన్ రిసెర్చ్ డా. రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, ములుగు జిల్లాలో సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో “సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్” ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చించారు.
గిరిజన ఆరోగ్య సేవల బలోపేతం, వైద్య పరిశోధనలు, అకడమిక్ సహకారం, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
గ్రామస్థాయిలో వ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, ఎయిమ్స్ బీబీనగర్–సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య సేవలు, అకడమిక్ కార్యక్రమాలు, పరిశోధనలను విస్తరించే కార్యాచరణను రూపొందించడం ద్వారా ములుగు జిల్లాను గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలు, ప్రజారోగ్య అధ్యయనాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డీఎంహెచ్వో డా. గోపాలరావు, ములుగు ఏరియా ఆసుపత్రి, ఏటూరునాగారం ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డా. చంద్రశేఖర్, డా. సురేష్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
