KTR BRS STUDENT PROTEST
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఢిల్లీలో గడిచిన 25 రోజులుగా పీజీ, యూజీసీ కోచింగ్ సెంటర్ల నిర్లక్ష్యం మరియు కనీస వసతుల లేమి, విద్యార్థుల మరణాలకు నిరసనగా పార్టీలకతీతంగా యువత చేపట్టిన పోరాటానికి బిఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ ఉద్యమానికి సంఘీభావంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద BRSV భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ నిరసన కార్యక్రమంలో BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.తారకరామారావు (KTR) స్వయంగా పాల్గొని విద్యార్థులకు అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన నల్ల చొక్కా ధరించి ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
* మేకిన్ ఇండియా అడిగితే.. లీకిన్ ఇండియా ఇచ్చారు
కేటీఆర్ మాట్లాడుతూ.. “దేశంలో యువత ఉద్యోగాలు, మెరుగైన భవిష్యత్తు కోసం ‘మేకిన్ ఇండియా’ కావాలని అడిగితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం పేపర్లు లీక్ చేస్తూ ‘లీకిన్ ఇండియా’ను కానుకగా ఇచ్చింది. యువత తమ భవిష్యత్తు గురించి, కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించి ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో 25 రోజులుగా యువత ఒంటరిగా పోరాడుతుంటే సపోర్ట్ చేయకపోగా, వారిపై పోలీసులతో దాడులు చేయించడం అత్యంత అమానుషం” అని మండిపడ్డారు.
* ఈ తరం దేనికీ భయపడదు
విద్యార్థులపై జరుగుతున్న అణచివేతను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, “బిఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా ప్రజా పోరాటాలను ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. మీడియా ఫోకస్ లేకపోయినా, ఎలాంటి రాజకీయ మద్దతు లేకపోయినా ఢిల్లీ వీధుల్లో యువత ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తోంది. ప్రధాని మోడీ ఎవరితో పెట్టుకోకూడదో సరిగ్గా వారితోనే పెట్టుకున్నారు. ఈనాటి తరం ఐటీ, ఈడీ సోదాలకు భయపడే తరం కాదు.. చావుకు కూడా భయపడని పోరాట తరం! రాజ్యమా.. నీవు ఉలిక్కిపడాల్సిందే!” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువత డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, విద్యార్థుల స్వరాన్ని అణచివేయడం ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BRSV ముఖ్య నాయకులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థి లోకానికి తమ పూర్తి మద్దతును తెలియజేశారు.
