MLA Kunamneni on NEET Paper Leak
* నీట్ పేపర్ లీక్పై కేంద్రాన్ని నిలదీసిన కూనంనేని..
ఆకేరు న్యూస్, జనగామ:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఐ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
* నైతిక బాధ్యత వహించాలి..
నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ పిలుపు లేకుండానే లక్షలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడిందన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడులకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
భవిష్యత్తు తరాల విద్యా వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి తీవ్రమైన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
