Tech Mahindra Employee Complaint for Termination
* పాప అనారోగ్యంతో లీవ్ పెడితే జాబ్ తీసేశారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా (Tech Mahindra) యాజమాన్యంపై భావన అనే మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంపెనీ తనను ఎలాంటి ముందస్తు సమాచారం, సరైన కారణం లేకుండా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం.. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిబంధనల ప్రకారమే 13 రోజుల పాటు సెలవు తీసుకుంది. అయితే, సెలవులో ఉన్న సమయంలో కూడా వెంటనే ఆఫీస్‌కు రావాలంటూ కంపెనీ యాజమాన్యం నిరంతరం ఈ-మెయిళ్ల ద్వారా తీవ్ర ఒత్తిడి తెచ్చిందని ఆమె ఆరోపించింది.
* పాప అనారోగ్యం అని చెప్పినా వినకుండా తీసేశారు..
ఆ తర్వాత కొద్ది రోజులకే తన చిన్నారికి ఆరోగ్యం క్షీణించడంతో భావన మరోసారి సెలవు అభ్యర్థించింది. అయితే, కంపెనీ ప్రతినిధులు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకపోగా.. “ఇంకెన్ని రోజులు లీవ్‌లో ఉంటారు?” అని ప్రశ్నిస్తూ వేధింపులకు గురిచేసి, చివరకు ఉద్యోగం నుంచే తీసివేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
* వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే..
కంపెనీలోని పని వాతావరణంపై తీవ్ర విమర్శలు చేసిన భావన.. “కార్యాలయంలో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయి. నా కెరీర్లో ఇటువంటి వర్క్ కల్చర్ ఎక్కడా చూడలేదు. మహిళా ఉద్యోగులకు కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటి సవాళ్లు ఉంటాయి. ఐటీ కంపెనీలు మహిళల పట్ల కాస్త మానవీయ కోణంలో, సానుభూతితో వ్యవహరించాలి” అని విజ్ఞప్తి చేసింది.
బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
