Kadiyam Srihari Crop Advice
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వర్ష పరిస్థితుల దృష్ట్యా రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసి ఆదాయం పొందాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఆరుతడి పంటల సాగు పై అవగాహన, విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుత ఎల్నినో (వర్షాభావ) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగును రైతులు విస్తృతంగా చేపట్టాలని, ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందని అన్నారు.
* “నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది”
అనే లక్ష్యంతో రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. రైతులు తమ సమీప రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అధిక సంఖ్యలో హాజరై, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక రంగం, కూరగాయల సాగు వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను కలిపి చేపడితే రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు.
కూరగాయల సాగు ద్వారా అనేక మంది రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యానవన పంటలను సాగు చేస్తే ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు. పశుసంపద అభివృద్ధికి అవసరమైన మేత పంటల సాగుపై ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) ఉద్యానవన పంటలు, ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలోని రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అనంతరం విత్తన మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, అందుబాటులో ఉన్న విత్తనాలను రైతులకు అందజేశారు. ఆయిల్ ఫామ్ సాగు మంచి లాభాలు ఇస్తున్నందున రైతులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా గోదావరి జలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్ డి ఏ ఎస్ సూచన మేరకు ప్రభుత్వం పని చేస్తుందని గోదావరి జలాలను నియోజకవర్ వర్గ రైతాంగానికి అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీ నీటి సరఫరాను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రజలు వారి మాటలు నమ్మొద్దు అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డీవో, తాసిల్దార్, జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.
