Peddi sudharshan Reddy
*ఐదు రోజులుగా యశోదా ఆస్పత్రిలో చికిత్స..
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తుది శ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుతో గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన జూలై 31 అర్ధరాత్రి 12.51 గంటలకు మృతి చెందారని యశోదా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణులతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తన దైన ముద్ర వేసుకున్నారు. ఉద్యమ కాలంలో అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని నిర్మించడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర అతి ముఖ్యమైనది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన ప్రజా సంబంధాలు కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.
* 9 సార్లు సీపీఆర్ ..
జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు 9 సార్లు సీపీఆర్ నిర్వహించి గుండె తిరిగి స్పందించేలా చేసినట్లు సమాచారం.అయినప్పటికీ ఆయన స్పృహలోకి రాకపోవడం, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపించలేదు. గుండె ఆగిపోయిన సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణిచింది. చివరకు ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
* నల్లబెల్లిలో అంత్యక్రియలు
పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో అంత్యక్రియలు జరుగుతాయి బంధువులు తెలిపారు.. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌లతో పాటు అనేక మంది బీఆర్ ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. హనుమకొండలోని అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం ఆయన మృత దేహాన్ని నల్లబెల్లికి తరలిస్తారు..
———————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
