Dhimsa dance with 13000 people creates Guinness World Record , Bhogapuram airport
ఆకేరు న్యూస్, విజయనగరం: ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో సుమారు 13 వేల మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ఏకకాలంలో థింసా నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.
* గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో రికార్డు నమోదు
ఈ భారీ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నిర్దేశించిన అన్ని ప్రమాణాలు పూర్తి కావడంతో ఈ ప్రదర్శనను అధికారికంగా ప్రపంచ రికార్డుగా గుర్తించారు. అనంతరం గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు.
* భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ
ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఈ ప్రత్యేక థింసా నృత్య ప్రదర్శనను సిద్ధం చేశారు. కార్యక్రమానికి ముందు నిర్వహించిన రిహార్సల్లోనే గిన్నిస్ రికార్డు నమోదవడం విశేషం.
* ప్రపంచానికి మన్యం సంస్కృతి పరిచయం
వివిధ ఐటీడీఏ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా థింసా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తరాంధ్ర మన్యం ప్రాంతాల కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలిచింది.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి కూడా గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొన్నారు. రికార్డు సాధన కోసం శ్రమించిన మహిళలు, విద్యార్థినులు, శిక్షకులు, అధికారులను ఆమె అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
