Wardhannapet ST Hostel Food Poisoning
* అల్పాహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: హన్మకొండ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎస్టీ (ST) ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో సోమవారం ఉదయం కలకలం రేగింది. హాస్టల్లో అందించిన అల్పాహారం వికటించి సుమారు 27 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
* కడుపునొప్పి, వాంతులు..
ఉదయం టిఫిన్ తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు వరుసగా కడుపునొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన హాస్టల్ నిర్వాహకులు వెంటనే బాధిత విద్యార్థులను వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
* వైద్యుల స్పందన – పరిస్థితి సురక్షితం..
ఆసుపత్రిలో విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలు అందించిన డాక్టర్లు, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
* అధికారుల పరామర్శ – విచారణకు ఆదేశం..
విషయం తెలిసిన వెంటనే డీఆర్డీఓ సీఈఓ రామ్‌రెడ్డి, వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్ సాగర్ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్టల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
