Jangaon Wife Attack Case
ఆకేరు న్యూస్, జనగామ:
జనగామ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమించి, కులాల సరిహద్దులను దాటి వివాహం చేసుకున్న భార్యపై ఓ భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. మరో మహిళతో ఏర్పడిన అక్రమ సంబంధం కారణంగా కుటుంబంలో గొడవలు మొదలై, చివరికి భార్యపై బేస్‌బాల్ బ్యాట్‌తో తీవ్రస్థాయిలో విచక్షణారహితంగా దాడి చేసే వరకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
* ప్రేమ పెళ్లి.. ఎనిమిదేళ్ల సంసారం…
బాధితురాలు మాధవి, జనగామ జిల్లా ఓబుళకేశపురం గ్రామానికి చెందిన మహీందర్ రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి, కులాంతర వివాహం చేసుకుని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ, ఇటీవల మహీందర్ రెడ్డికి మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో కుటుంబంలో తీవ్ర వివాదాలు ప్రారంభమయ్యాయి. మరో మహిళ వ్యామోహంలో పడ్డ మహీందర్, భార్య మాధవిని వేధించడం మొదలుపెట్టాడు.
* సర్పంచ్ ఎదుటే రక్తం వచ్చేలా దాడి…
దంపతుల మధ్య విభేదాలు రోజురోజుకూ పెరగడంతో, కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి చెందిన సర్పంచ్ చొరవ తీసుకున్నారు. ఇద్దరినీ మాట్లాడి సమస్యను సర్దుబాటు చేస్తామని సర్పంచ్ పిలవడంతో మాధవి నమ్మకంతో అక్కడికి చేరుకుంది. అయితే, పథకం ప్రకారమే వచ్చిన మహీందర్ రెడ్డి, తన వెంట తెచ్చుకున్న బేస్‌బాల్ బ్యాట్‌తో సర్పంచ్ మరియు ఊరి జనం చూస్తుండగానే భార్య మాధవిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. తల, శరీరంపై బేస్‌బాల్ బ్యాట్‌తో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే రక్తమడుగులో పడిపోయింది.
* ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన…
గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన మాధవిని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న బాధితురాలి బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుకున్న భార్యపై ఈ రకంగా కిరాతక దాడికి పాల్పడిన మహీందర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.
ఘటన అనంతరం నిందితుడు మహీందర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జనగామ పోలీసులు, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
