Minister Ponnam Prabhakar Husnabad
ఆకేర్ న్యూస్, హుస్నాబాద్:
ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, భావితరాలకు పచ్చని లోకాలను అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా మంత్రి విద్యార్థులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విపరీతమైన వర్షాలు, ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు రావడానికి పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. మొక్కలు నాటడం కేవలం ఒకరోజు జరిగే కార్యక్రమం కాదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. హుస్నాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
* చేనేత వస్త్రాలు వాడాలని ప్రతిజ్ఞ
హుస్నాబాద్‌లోని మార్కండేయ ఆలయంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సింథటిక్ శాలువాలకు దూరంగా ఉండి, కేవలం చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలనే ప్రతి ఒక్కరూ వాడాలని పిలుపునిచ్చారు. చేనేత బట్టలు వాడడం వల్ల ఆ వృత్తిని, కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు అవుతుందని, గుడిసె వరకు పత్తిని అందించే రైతును ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అందరం చేనేత వస్త్రాలు వాడాలని ప్రతిజ్ఞ చేశామన్నారు.
* హుస్నాబాద్ డిగ్రీ కళాశాలకు మరిన్ని వసతులు..
హుస్నాబాద్‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి స్టీల్ బ్యాంకులను అందుబాటులోకి తెచ్చామని మంత్రి గుర్తుచేశారు. తాము తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు డిగ్రీ కళాశాలకు సరైన రోడ్డు కూడా లేదని, నేడు అక్కడ సీసీ రోడ్డు వేయించామని తెలిపారు. త్వరలోనే కళాశాలకు కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకుని, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను మరింత పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది, ఇతర ముఖ్య నేతలు మరియు అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
