Telangana Gig Workers Strike
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సేవలు స్తంభించిపోనున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ 16 రవాణా, డెలివరీ రంగానికి చెందిన వాహన సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు ఒక ప్రకటనలో సమ్మె నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి తట్టిలేపేందుకే ఈ రాష్ట్రవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మె ప్రభావంతో ఆటోలు, క్యాబ్‌లు, లారీలతో పాటు ఓలా, ఉబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర యాప్ ఆధారిత రవాణా, డెలివరీ సేవలు అన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. తమ సమస్యలపై గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
* వారి ప్రధాన డిమాండ్లు..
* కనీస ఛార్జీల నోటిఫికేషన్…
యాప్ ఆధారిత రవాణా సేవలకు సంబంధించి ప్రభుత్వం మరియు ప్లాట్‌ఫారమ్ కంపెనీలు కలిసి కనీస బేస్ ఫేర్‌ను ఖరారు చేయాలి. ప్రతి కిలోమీటరుకు, అలాగే ప్రయాణ సమయాన్ని బట్టి ప్రతి నిమిషానికి న్యాయమైన ఛార్జీలను వెంటనే నోటిఫై చేయాలి.
* స్థిరమైన రాబడి..
డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు మరియు ఇతర గిగ్/ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కనీస వేతనం, స్థిరమైన ఆదాయం లభించేలా చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలి.
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు… ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ రూల్స్’ను వెంటనే నోటిఫై చేసి, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తక్షణమే ఒక ప్రత్యేకాధికార సంక్షేమ బోర్డును (Welfare Board) ఏర్పాటు చేయాలి.
అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ అమలు… మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025ను సమగ్రంగా అమలు చేస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస రవాణా ఛార్జీలను అధికారికంగా ప్రచురించాలి.
* వైట్ ప్లేట్ (నాన్-కమర్షియల్) వాహనాలపై నిషేధం…
మోటార్ వెహికల్స్ చట్టం-1988, అగ్రిగేటర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా కమర్షియల్ రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ప్రయాణికుల లేదా సరుకు రవాణా కోసం వినియోగించడాన్ని తక్షణమే నిషేధించాలి.
రవాణా రంగాన్ని, గిగ్ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఈ సమ్మె కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నిరసనకారులు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
