Sanathnagar POCSO Case
* కామాంధుడైన తండ్రి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రక్షణగా నిలవాల్సిన కన్నతండ్రే కాలకూట విషమై మారాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురిపైనే కన్నువేసి, బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
* తాగుడుకు బానిసై రోజు వేధింపులు..
సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో కుటుంబ యజమాని అయిన 45 ఏళ్ల వ్యక్తి హౌస్‌కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తీవ్రంగా మద్యం అలవాటు ఉన్న నిందితుడు రోజూ రాత్రి పూట తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలతో గొడవపడేవాడు. ఇంటి వాతావరణాన్ని నరకప్రాయంగా మారుస్తూ తరచూ వారిపై దాడులకు తెగబడేవాడు.
భయపెట్టి పలుమార్లు అకృత్యం
ఈ క్రమంలోనే నిందితుడు తన 16 ఏళ్ల రెండో కుమార్తెపై కన్నేశాడు. భయపెట్టి, బెదిరింపులకు గురిచేసి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఇంట్లో తెలిసినప్పటికీ, సమాజంలో పరువు పోతుందనే భయంతో కుటుంబసభ్యులు బయటకు చెప్పలేక మౌనంగా భరించారు. అయితే, తండ్రి అకృత్యాలు రోజురోజుకూ శ్రుతిమించడమే కాకుండా, రోజూ తాగి వచ్చి కుటుంబసభ్యులపై భౌతిక దాడులు చేయడం తీవ్రమైంది.
* ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు..
తండ్రి వేధింపులు, ఆఘాయిత్యాలను ఇక భరించలేకపోయిన బాధితురాలు గురువారం సాయంత్రం అత్యంత ధైర్యంతో సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. తాను ఎదుర్కొన్న దారుణాలను, తండ్రి చేసిన అకృత్యాలను పోలీసుల ముందు పూసగుచ్చినట్లు వివరించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తక్షణమే స్పందించిన సనత్‌నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
