ఆకేరు న్యూస్, ఎల్కతుర్తి:
నవజాత శిశువుకు తల్లిపాలే శ్రీరామరక్ష అని, అవి అమృతంతో సమానమని ఇందిరానగర్ సర్పంచ్ అంబాల రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ఇందిరానగర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ ఎడ్ల రజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ కోరే లావణ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంబాల రాజ్‌కుమార్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. మొదట వచ్చే పసుపు రంగు పాలు (కొలస్ట్రమ్) బిడ్డలో వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయని వివరించారు. పుట్టిన మొదటి ఆరు నెలల వరకు పాపాయికి కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, నీరు, తేనె, గ్లూకోజ్ లేదా ఇతర ఆహార పదార్థాలు ఏవీ ఇవ్వకూడదని సూచించారు.
అలాగే గర్భిణీ స్త్రీలు సమతుల్య పోషకాహారం తీసుకోవడంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు సమయానికి వాడాలని, ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని చెప్పారు. బాలింతలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు మంచి పోషకాహారాన్ని భుజించడం ద్వారా తల్లిపాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు స్వరూప రాణి, పుష్పలత, ఆశా వర్కర్ కడారి మాధవి, అంగన్వాడీ టీచర్ ఎడ్ల రజిత, ఆయా సందెల జ్యోతితో పాటు పలువురు గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
