MP Kadiyam Kavya Baindla Community Development
* బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందుకు సాగాలి
– ఎంపీ కడియం కావ్య
అకేరు న్యూస్ హైదరాబాద్: బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించుకుని యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ బైండ్ల ఉద్యోగుల సంఘం (BEAT) ఆధ్వర్యంలో నిర్వహించిన విజన్ మీట్–2026 కార్యక్రమానికి కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి తాను పార్లమెంట్ వరకు చేరడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.
కులవృత్తి ద్వారా ఆదాయం వస్తోందనే కారణంతో పిల్లల చదువును మధ్యలోనే ఆపవద్దని, ఉన్నత విద్య, వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రాధాన్యతనిచ్చి, వారు జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలని కోరారు.
‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తితో సమాజం నుంచి పొందిన దాన్ని తిరిగి సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువత తమకు సాధ్యమైన విధంగా సమాజానికి సేవ చేయాలని సూచించారు.
* బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు కోరాం
బైండ్ల భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కోరినట్లు కడియం కావ్య తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
* BEATను బలోపేతం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బైండ్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువతను BEATలో భాగస్వాములను చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఎంపీ సూచించారు. గ్రూపులు, విభేదాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా సంఘం కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
తమ వద్ద పెద్దగా ఆస్తులు, ఆర్థిక వనరులు లేకపోయినా నిజాయితీ, తెలివితేటలు, ప్రజాబలమే తమ పెట్టుబడులని కడియం కావ్య పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తన తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా, తాను ఎంపీగా ప్రజాసేవలో కొనసాగడం గర్వకారణమన్నారు. రాజకీయ హోదాలు ఉన్నా లేకపోయినా సమాజానికి తన సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బైండ్ల సమాజ అభివృద్ధికి BEAT వేదికగా నిలవాలని, ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ సమాజంలో పరస్పర అనుబంధాలను పెంచుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో BEAT అధ్యక్షుడు చినపాక స్వామి, కోశాధికారి డా. జీలకర్ర స్వామి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, సంయుక్త కార్యదర్శి జీలకర్ర రామ్మూర్తి, ముఖ్య సలహాదారు కడెం ధనుంజయ, సలహాదారులు డా. జీలకర్ర సోమశేఖర్, చినపాక శ్రీనివాస ప్రసాద్, ఏ. ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
