Hyderabad Drunk And Drive
* భారీగా పట్టుబడుతున్న మందుబాబులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నా.. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నా.. కొందరు మద్యంబాబుల తీరు మారడం లేదు. మందుతాగి వాహనాలతో రోడ్డెక్కేస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా వీకెండ్లో మరింత ఎక్కువగా చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో అధిక సంఖ్యలో మందుబాబులు పట్టుబడుతున్నారు.
* హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో..
ప్రతీ శని, ఆదివారాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ తనిఖీలు కొనసాగాయి. రెండు రోజుల పాటు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 421 మంది మందు తాగిన మత్తులో వాహనం నడిపి పట్టుబట్టారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 344 మంది ద్విచక్ర వాహనదారులు, 37 మంది ఆటో డ్రైవర్లు, 40 మంది కార్లు నడిపేవారు ఉన్నారు. వాహనయజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను సీజ్ చేశారు.
* సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 311 మంది పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జి నరేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుబడినన వారిలో 238 మంది ద్విచక్రవాహనదారులు, 16 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది కార్లు నడిపేవారితో పాటు 1 భారీ వాహన డ్రైవర్ ఉన్నారు.
* జైలు శిక్ష.. జరిమానాలు..
గత శని, ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన 283 మందిని కోర్టులో హాజరుపరిచినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జి నరేందర్ తెలిపారు. న్యాయమూర్తి వారిలో ఒకరికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 11 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని, మరో 271 మందికి జరిమానా విధించారని తెలిపారు.
* కఠిన చర్యలు తీసుకుంటాం
మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ హెచ్చరించారు. రహదారి భద్రతను పెంచడం, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా నగరంలో ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. వాహనదారులు అర్థం చేసుకుని మందు తాగి రోడ్డుపై రావొద్దని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
